తెలుగుహిందూశాఖ

August 17, 2006

మనలో ఎన్ని మతాలున్నా, కులాలున్నా అందరమూ తెలుగువారమే. మన తెలుగుజాతీయులు ఎన్నోసార్లు మతం మార్చుకున్నారు. మన భాష మాట్లాడే పద్ధతి, రాసే పద్ధతి కూడా గత 2,000 సంవత్సరాల్లో ఎన్నో సార్లు మారిపోయింది. ఇది ఒక ప్రకృతిధర్మం. అయినా తెలుగు అనే భాష ఇప్పటికీ ఉంది. తెలుగువాళ్ళమని చెప్పుకునే ఓ నాగరిక మానవ సమూహం ఇంకా జీవించే ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం.

మన తెలుగువారిలో 85 శాతం మంది హిందువులు. భరతఖండమంతటా వ్యాపించిన సువిశాలమైన హిందూధర్మంలో తెలుగుహిందూశాఖ ఒకటి ఉంది.దానికి తనదంటూ కొంత చరిత్ర ఉంది. తన స్వంత ఆచార వ్యవహారాలున్నాయి. తాను మాత్రమే అనుసరించే, తనకి మాత్రమే ప్రత్యేకమైన శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. తనకి మాత్రమే తెలిసిన తన స్వంత జాతీయ ఇతిహాసాలున్నాయి. అవన్నీ అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో ఈ సైటు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అవన్నీ మనవని మనం చెప్పుకున్నా, వాటిని ఇతరభాషల్లోకి అనువదించేవారెవరైనా ఉంటే, అవి అందరికీ చెందే అవకాశం ఉంటుంది. హిందూమతానికి తెలుగు హిందువుల వితరణ (contribution), సేవ ఎంతటివో లోకవిదితం కావాలి.

నా పరిమితులు

ఎవరి పరిమితులు వారు తెలుసుకోవడమే పరిణతి (maturity) కి చిహ్నం.అలాగే, ఓ రచయితగా నా పరిమితులు నాకున్నాయి. నేనెంత తెలుగుజాతీయవాదినయినా తెలుగు క్రైస్తవాన్ని గురించో, లేక తెలుగు ఇస్లాము గురించో సాహసించి రాయలేను. నేను తెలుగుహిందువుని కావడమే ఇందుకు కారణం. ఆ మతగ్రంథాలు చదివినా సరే, ఈ కారణం చేత వాటిపై సాధికారికంగా వ్యాఖ్యానించలేము. మనం పొరపడే అవకాశముంది. లేదా పొరపాటుగా అర్థం చేసుకోబడే అవకాశముంది. కనుక, అలాంటి అప్రయోజక వివాదాల జోలికి పోకుండా, నేను పుట్టి పెరిగిన తెలుగుహిందూశాఖ గురించి రాయడంలో నాకు సౌలభ్యముంది. ఆయా మతాల తెలుగుశాఖల గురించి రాసే విషయాన్ని ఆయా మతాలకి చెందిన తెలుగువారికే వదిలిపెడుతున్నాను. 

సాధ్యమైనంత త్వరలో మన తెలుగు పూర్వీకుల మతసాహిత్యం గురించి సవివర వ్యాసాలు టపా చెయ్యగలనని ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాను.     

August 17, 2006

Follow

Get every new post delivered to your Inbox.